CM Chandrababu : విశాఖపట్నం అభివృద్ధికి నూతన దిశలో అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ముంబైను మించి అభివృద్ధి సాధించే లక్ష్యంతో విశాఖను “ముంబై కా బాప్”గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే రైల్వే జోన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. త్వరలో మెట్రో రైలు సేవలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
CM Chandrababu Key Comments
ఈ మేరకు విశాఖ అభివృద్ధికి ప్రత్యేక విజన్ సిద్ధం చేసినట్టు పేర్కొన్న సీఎం, త్వరలో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను అధికారికంగా విడుదల చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా విశాఖను రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు.
2032 నాటికి $120 బిలియన్ సంపద లక్ష్యం
ఆర్థికంగా విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను మెరుగ్గా అభివృద్ధి చేయాలని సూచించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu)… వచ్చే ఏడు సంవత్సరాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల ద్వారా 120 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.
లక్ష్యంగా 24 లక్షల ఉద్యోగాలు
ఈ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ద్వారా 20 నుంచి 24 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని చెప్పారు. దీనికోసం ఏడు కీలక రంగాల్లో ప్రణాళికా బలాన్ని పెంచుతున్నామని వివరించారు. వీటిలో పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.
అభివృద్ధికి ఏడు సంవత్సరాలు గడువు
“వైజాగ్‌ను ముంబై కంటే ముందుకు తీసుకెళ్లే భరోసా మా దగ్గర ఉంది. ఏడేళ్ల టైం ఇవ్వండి… బొమ్మ అద్దిరిపోయేలా మారుతుంది” అంటూ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని కంపెనీలు వచ్చేందుకు అవసరమైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేస్తోందని చెప్పారు. ఈ ప్రకటనలతో విశాఖ నగర ప్రజల్లో అభివృద్ధిపై కొత్త ఆశలు మొదలయ్యాయి.
Also Read : America – Iran Attack : 3 ఇరాన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసిన అమెరికా















