Maniratnam : కాలం మారుతున్న కొద్దీ సినిమాల పట్ల ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. ఒకప్పుడు హీరో పేరుతో సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు, ఇప్పుడు కథా కథనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ మార్పును గమనించిన చిత్ర నిర్మాతలు, దర్శకులు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. విజయవంతమైన చిత్రాలకు ధన్యవాదాలు చెబుతూనే, పరాజయాన్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రం నిర్భయంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి క్షమాపణలు కోరడం ఇటీవలితరంలో కనిపిస్తున్న కొత్త సంస్కృతి. ఇదే కోవలో, ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) కూడా తాజాగా స్పందించారు.
Maniratnam Respond on ‘Thug Life’
కల్ట్ క్లాసిక్స్‌కు మరో పేరు మణిరత్నం. అటు విశ్వనటుడు కమల్ హాసన్, ఇటు మణిరత్నం కలయికలో వచ్చిన నాయకుడు చిత్రాన్ని ఇప్పటికీ గొప్ప గ్యాంగ్‌స్టర్ సినిమాల జాబితాలో పైనే ఉంచుతారు. అదే కాంబోలో వచ్చిన తాజా చిత్రం థగ్ లైఫ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి కలిగించింది.
అయితే ప్రేక్షకుల అంచనాలకు విరుద్ధంగా, థగ్ లైఫ్ తీవ్రంగా నిరాశపరిచింది. కథ బలహీనత, కమల్ హాసన్ పాత్ర చుట్టూ ఏర్పడిన వివాదాలు సినిమాను మరింత దిగజార్చాయి. అభిమానులు థియేటర్లకు వెళ్లినా, సినిమా చూస్తూనే నిరాశతో బయటకొచ్చారు. ఇండియన్ 2 కంటే తక్కువ కలెక్షన్లు రాబట్టి, ఈ చిత్రం డిజాస్టర్‌ల జాబితాలో చేరిపోయింది.
ఈ నేపథ్యంలో మణిరత్నం స్పందిస్తూ, “ప్రేక్షకుల నిరాశను అర్థం చేసుకున్నాం. మా వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నాం. నాయకుడు స్థాయి సినిమా కోసం ఎదురు చూసిన వారిని మేం నిరాశపర్చాం. మా ఉద్దేశ్యం అలా కాదు. ఎవరైనా తక్కువ సినిమా తీయాలని అనుకుంటారా? మేము ఎంతో ఆశగా థగ్ లైఫ్ తెరకెక్కించాం. కానీ, ప్రేక్షకులు మరింత గంభీరమైన కథను కోరుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది. అటువంటి కథతోనే త్వరలో వస్తాను. ఇప్పటి కోసం క్షమించండి” అంటూ వినమ్రంగా స్పందించారు.
ప్రస్తుతం మణిరత్నం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి. దర్శకుడిగా ఆయన చూపించిన బాధ్యతాభావం చాలా మందిని ఆకట్టుకుంటోంది.
Also Read : Natural Star Nani : హాయ్ నాన్న డైరెక్టర్ తో మరో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్















