Nara Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ (టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) న్యూఢిల్లీలో కలుసుకున్నారు. తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు.
Minister Nara Lokesh Meet
గతేడాది జూలై నెలలో ముంబైలో మొదటిసారి ఈ ఇద్దరూ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై టిబిఐ సంస్థతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో అప్పట్లో చర్చలు సాగాయి. ఆ చర్చల ఫలితంగా, 2024 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు టిబిఐ మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, విద్యారంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచి యువతకు ఉద్యోగావకాశాలు పెంచే లక్ష్యంతో చురుకుగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఒప్పందం కింద టిబిఐ తమ ప్రత్యేక బృందాన్ని విజయవాడలో మొహరించి రెండు ముఖ్యమైన అంశాలపై దృష్టిసారించింది. మొదటిది – ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు; రెండవది – గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) స్థాపన. ఈ కార్యక్రమాల పురోగతిపై మంత్రి లోకేష్, టోనీ బ్లెయిర్ సమీక్షించారు.
అలాగే, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ సెన్సస్, విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టిబిఐతో ఉన్న సహకారం, భవిష్యత్ వ్యూహాలు అనే అంశాలపై కూడా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్, టోనీ బ్లెయిర్‌ను గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా మండలిలో చేరాలని ఆహ్వానించారు.
గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనలో భాగస్వామ్యంతో పాటు నైపుణ్య శిక్షణ అంశాల్లో ప్రభుత్వానికి సహకరించేందుకు టిబిఐ ముందుకు వచ్చింది. టోనీ బ్లెయిర్ ప్రకారం, 2025 ఆగస్టులో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్‌లో టిబిఐ కూడా భాగస్వామిగా పాల్గొననుంది. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, టిబిఐ ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read : Maoists Encounter Shocking : మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టు అగ్రనేతలు రవి, అరుణ దుర్మరణం
