Naveen Patnaik : పురాతన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూరీ జగన్నాథ రథయాత్రలో ఈసారి విషాదం చోటుచేసుకుంది. గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రస్థాయిలో స్పందించారు.
Naveen Patnaik Shocking Comments on Puri Ratha Yatra Stampede
నవీన్ పట్నాయక్ అధికారికంగా స్పందిస్తూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రథయాత్ర నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భక్తుల భద్రతకు సంబంధించిన కీలక అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రమాదానికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. రథయాత్రను శాంతియుతంగా నిర్వహించడంలో ప్రభుత్వం అసమర్థతను చాటుకుందని అన్నారు.
నందీఘోష రథాన్ని లాగడంలో తటస్థమైన జాప్యాన్ని కూడా నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) విమర్శించారు. దీన్ని “మహాప్రభు ఇచ్ఛ”గా సమర్థించుకోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేస్తోందని చెప్పారు. జన సమూహాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమైన అధికార యంత్రాంగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
అంతేగాక, అడప బిజె, బహుదా, సునా బేషా వంటి ముఖ్యమైన ఆచారాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నవీన్ పట్నాయక్, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇక, ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కూడా స్పందించారు. అయితే ఆయన బీజేడీ పార్టీపై ఎదురుదాడికి దిగారు. గతంలో బీజేడీ ప్రభుత్వ హయాంలో కూడా రథయాత్ర నిర్వహణలో దుర్గతులే జరిగాయని గుర్తు చేశారు. 1977 నుంచి రెండో రోజే రథాలు గుండిచా ఆలయానికి చేరేవని చెబుతూ, బీజేడీ ఇప్పుడు రాజకీయ లబ్దికోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు.
ఈసారి రథయాత్రలో మూడు రథాలు గమ్యస్థానానికి సగం దూరం కూడా చేరకముందే, భారీ జనసమ్మర్దం వల్ల రథాలను లాగడంలో ఆటంకం ఏర్పడింది. ట్రక్కులు ప్రవేశించడంతో గుండిచా ఆలయం సమీపంలో భక్తుల మధ్య గందరగోళం నెలకొనడం తొక్కిసలాటకు దారితీసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, భద్రతా ఏర్పాట్లపై వస్తున్న విమర్శలు రాజకీయం తారాస్థాయికి చేరుకున్నాయి.
Also Read : Bonalu Festival Sensational : అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాల పండగ















