Nani : నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు 32 సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆయన 33వ చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ దశలో ఉంది. 2008లో ‘అష్టాచమ్మా’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాని, అప్పటి నుండి వెనుకడుగు లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ‘హిట్ 3’ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.
Nani Another Movie with Hi Nanna Director
విశేషం ఏంటంటే, నాని (Nani) ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. తన నిర్మాణ సంస్థ ద్వారా వచ్చిన ‘హిట్’ సినిమా, అలాగే తాజాగా నిర్మించిన ‘కోర్ట్’ సినిమాలకు కొత్త దర్శకులనే ఎంపిక చేశాడు. అయితే ఈ 17 ఏళ్ల కెరీర్‌లో నాని కేవలం నలుగురు దర్శకులతో మాత్రమే పునరావృత సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆ జాబితాలో ఐదో దర్శకుడు చేరబోతున్నాడు — అతనే శౌర్యువ్.
నాని… తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మన్’, ‘వి’ సినిమాలు చేశాడు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ సినిమాలు చేశారు. వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికీ…’, ‘సరిపోదా శనివారం’ చేశారు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి, ప్రస్తుతం ఆయనతో ‘ది ప్యారడైజ్’ సినిమాను చేస్తున్నాడు. పైగా, చిరంజీవిని హీరోగా తీసుకుని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించేందుకు కూడా నాని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పుడు నాని మరోసారి అవకాశం ఇవ్వబోతున్న ఐదో దర్శకుడు — శౌర్యువ్ (Shouryuv). అతను దర్శకత్వం వహించిన ‘హాయ్ నాన్న’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోకపోయినా, నానికి నటుడిగా మంచి పేరు తెచ్చింది. decent కలెక్షన్స్‌తో సినిమా నిలిచింది. ఈ నేపథ్యంలో, నాని, ‘హాయ్ నాన్న’ నిర్మాతలు కలిసి శౌర్యువ్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఈ సినిమా గురించి మొదట పాన్ ఇండియా రొమాంటిక్ కామెడీ అనే టాక్ వినిపించగా, తాజా సమాచారం ప్రకారం ఇది పిరియాడిక్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’లో నానిని కొత్తగా చూపించిన శౌర్యువ్, ఈ సారి ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాని ప్రస్తుతం చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పూర్తయిన తర్వాత, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు అనంతరం వచ్చే యేడాది శౌర్యువ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read : Popular Actor Srikanth : ప్రముఖ తెలుగు మరియు తమిళ నటుడు శ్రీకాంత్ పై డ్రగ్స్ కేసు
